చైనాకు చెందిన ఓ యువకుడు తన పెళ్లికి బంధువులు లేకపోవడంతో వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన పెళ్లికి రావాలంటూ సోషల్ మీడియా ద్వారా అపరిచితులను ఆహ్వానించాడు. అతడి పిలుపునకు ఊహించని స్పందన లభించింది. వందలాది మంది అపరిచితులు పెళ్లికి తరలివచ్చి వేడుకను ఘనంగా జరిపించారు.
చైనాలోని యునాన్ ప్రావిన్స్ జావోటాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల జూ చెంగ్హాంగ్ చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతడికి మూడేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. రెండేళ్ల తర్వాత తల్లి మరో వివాహం చేసుకుంది. దీంతో అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు తోడుగా పెరిగారు. వారిని చూసుకున్న అమ్మమ్మ కూడా మరణించడంతో పొరుగువారి సహకారంతో పెరిగారు.
ఎన్నో కష్టాలు ఎదురైనా యువకుడు కష్టపడి పనిచేస్తూ కొంత డబ్బు పొదుపు చేసుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పెళ్లికి హాజరై ఆశీర్వదించే బంధువులు పెద్దగా లేకపోవడంతో ఆందోళన చెందాడు. తన జీవితంలో ముఖ్యమైన వేడుక అతిథులు లేకుండా జరిగిపోతుందేమోనని బాధపడ్డాడు.
సోషల్ మీడియాలో పెళ్లి ఆహ్వానం
దీంతో తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. తన పెళ్లికి బంధువులు ఎక్కువగా లేరని, అపరిచితులైనా సరే వచ్చి వేడుకలో పాల్గొని తన సంతోషాన్ని పంచుకోవాలని కోరాడు. మొదట తన ఆహ్వానానికి పదిమంది నుంచి 20 మంది వరకు స్పందిస్తారని భావించాడు. కానీ అనూహ్యంగా దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి స్పందన లభించింది.
సోదరా.. మేము వస్తున్నాం అంటూ పలువురు కామెంట్లు చేశారు. కొందరు స్వయంగా పెళ్లికి హాజరవుతామని తెలిపారు. ఈ ఆహ్వానం క్రమంగా వైరల్గా మారింది.
బహుమతులు, వంట సామగ్రితో వచ్చిన అతిథులు
యువకుడి పిలుపుతో పెళ్లికి వచ్చిన అపరిచితులు కేవలం అతిథులుగా మాత్రమే ఉండిపోలేదు. పెళ్లి ఏర్పాట్లలోనూ భాగస్వాములయ్యారు. కొందరు బహుమతులు, వంటకు అవసరమైన సరుకులు తీసుకొచ్చారు. మరికొందరు వంట సామగ్రిని అందించారు. పలువురు వంటవాళ్లు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పెళ్లి విందు సిద్ధం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఇంకొందరు పెళ్లి కోసం ప్రత్యేకంగా కార్లను ఏర్పాటు చేశారు. వధూవరుల ప్రయాణం కోసం ఓ వ్యక్తి ఖరీదైన మేబ్యాక్ కారును కూడా అందించారు. మరికొందరు ఇంటిని అలంకరించేందుకు కొవ్వొత్తులు, ఇతర వస్తువులు తీసుకొచ్చారు.
భారీగా పెరిగిన అతిథుల సంఖ్య
మొదట చిన్న స్థాయిలో నిర్వహించాలనుకున్న పెళ్లికి అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో ఏర్పాట్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. నిర్ణయించిన వేదిక సరిపోకపోవడంతో సమీపంలోని పెద్ద ప్రాంగణానికి వేడుకను మార్చారు. అతిథుల రాకపోకలు, భద్రత, ఆహార ఏర్పాట్ల విషయంలో స్థానిక అధికారులు కూడా సహకరించారు.
ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రక్తసంబంధం లేకపోయినా అపరిచితులు చూపించిన ఆప్యాయత, సహకారం చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

