భైంసా, 9 November
కార్తీక మాసంలో బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో, ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయడాన్ని వన భోజనం అంటారు. ఇది ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు. జపాన్లో కూడా హనామి పేరుతో ఇలాంటి వేడుక చేసుకుంటారు.
కార్తీకమాసంలో బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో, ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయడాన్ని వన భోజనం అంటారు. ఇది ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు. జపాన్లో కూడా హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఇలాంటి వేడుక చేసుకుంటారు. ఇది జపాన్లో విశేష ఆదరణ పొందిన వేడుకలలో ఒకటి.
వన భోజనం పరమార్థం
కార్తీక మాసంలో వనభోజనం తప్పనిసరి. వనం అంటే అరణ్యాన్ని ప్రేమించడం అని అమరకోశం చెబుతుంది. కార్తీక మాసంలో వన భోజనానికి ఎందుకు వెళ్లాలి దీని వెనుక ఒక పరమార్థం ఉంది. అరణ్యానికి వెళ్ళినవాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. వానప్రస్థంలో అందరూ అరణ్యంలోనే గడుపుతారు. అక్కడ ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక ఆశ్రమం కట్టుకొని, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారు. దానికి సాధనే వనభోజనం. అందుకే వనభోజనానికి పవిత్రమైన హృదయంతో వెళ్లాలి. ప్రకృతిలో ఉపద్రవం ఉన్నప్పుడు, ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని పొందాలి.
ఆరోగ్యదాయక వృక్షాలు
ఆరోగ్యాన్నిచ్చే ఉసిరి, తులసి, మామిడి చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి. ఉసిరి, తులసిల గురించి మనకు తెలుసు. మామిడి విశిష్టత ఏమిటంటే, సంస్కృతంలో దానికి రసాలం అని పేరు. పరమేశ్వరుని పేరున్న ఏకైక చెట్టు మామిడి. పరమేశ్వరుడే ఈ భూమిపై చెట్టుగా వస్తే అది మామిడి చెట్టే. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఉన్న చోటికి వెళ్లాలి.
వ్రతాలు, పూజలు
సత్యనారాయణ స్వామి వ్రతం లేదా మరే ఇతర వ్రతాన్నైనా చేయాలి. విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం వంటివి సాయంత్రం దాకా చదవాలి. ఉదయం మహా నైవేద్యం పెట్టి భోజనం చేయాలి.
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు, ఇతర స్నేహితులతో, ఓరేయ్, రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా అన్నాడు. వారు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వారికి కొత్తగా వన భోజనం ఎందుకు వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలుర లక్షణం ఏమిటంటే, వారు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపిన లీలలు అనంతం. వనం అంటే బ్రహ్మం కాబట్టి, బ్రహ్మాన్ని అరిగించడం అంటే కృష్ణభగవానుడి లీలలను ఆస్వాదించడమే వన భోజనం. ఆ వన భోజనంలో ఏ అరమరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదాత్మ్యం పొందారు. మనం కూడా వనంలోకి వెళ్లి, ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా ఉండి అన్నం తిని, ఆ ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడమే వన భోజనం. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.


