వేములవాడ, 13 November
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది.
రాజన్న జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో పాటు శుక్రవారం కలిసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, అన్నపూజలు, కుంకుమ పూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చన వంటి ఆర్జిత సేవలలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే, గండ దీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకుని భక్తులు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి, అర్చకులకు దీపదానం చేశారు. ఆలయ ప్రాంగణంలోని నాగదేవత విగ్రహాలకు భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, హారతులు సమర్పించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

