కుబీర్, 13 November
విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి, సాంప్రదాయ వంటకాలను పరిచయం చేయడానికి నిర్మల్ జిల్లా మండలం పార్డి (బి) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఆహార ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొని తోటివారితో పంచుకున్నారు.
ఈ ఫుడ్ ఫెస్టివల్స్ ద్వారా పిల్లల్లో వంట పట్ల అవగాహన పెరగడంతో పాటు, అందరితో కలిసి భోజనం చేయడం ద్వారా పంచుకునే గుణం అలవాటు పడుతుందని ప్రధానోపాధ్యాయులు సయ్యద్ మోసిన్ తెలిపారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన, పౌష్టికాహార పదార్థాలను తీసుకోవాలనే అవగాహన కోసం, ఆహార పదార్థాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతోపాటు ఉపాధ్యాయులు రవీందర్, మెట్పల్లి సాయినాథ్, జట్ల రంజిత్, జై సింగ్, జాదవ్ గీత కుమార్, శ్రావణి, యోగిత్, గ్రామస్తులు కే. గంగాధర్, ఆఫ్రోజ్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.






