వరంగల్, 13 November
హనుమకొండలో జరగనున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సుకు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఐఎల్పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, బడుగు, బలహీన వర్గాల న్యాయవాదుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని డి కన్వెన్షన్ హాల్లో ఈ నెలలో జరగనున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఐఎల్పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సదస్సు కన్వీనర్ చిల్ల రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు, ఐఎల్పీఏ నాయకులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ పిలుపునిచ్చిన పే బ్యాక్ టు సొసైటీ లక్ష్యంగా, నల్ల కోట్లతో నీలి విప్లవం నినాదంతో ఐఎల్పీఏ పనిచేస్తుందని, మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో నిరంతరం బహుజన, అణగారిన పేద న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తూనే బహుజన సమాజ చైతన్యం కోసం పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎల్పీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సదస్సు కో కన్వీనర్ తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ, సాంస్కృతిక విప్లవం విజయవంతం కాకుండా బహుజన సమాజ విముక్తి జరగదని అన్నారు. భారత రాజ్యాంగం న్యాయవాదులకు ఉపయోగపడే గ్రంథమే కాదని, బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చే స్ఫూర్తిదాయక వాహనమని ఆయన అభివర్ణించారు. అలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామగ్రామానికి తీసుకెళ్లడమే ఐఎల్పీఏ లక్ష్యమని ఆయన అన్నారు. అణగారిన వర్గ న్యాయవాదులకు, ప్రజలకు ఐఎల్పీఏ మార్గదర్శిగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎల్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ, బి.సి మోర్చా జాతీయ అధ్యక్షులు చౌదరి వికాస్ పటేల్ అధ్యక్షతన జరుగు రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా విశ్రాంత హై కోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమీషన్ కమీషనర్ జస్టిస్ ఈద తిరుమలదేవి హాజరవుతున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా , హనుమకొండ జిల్లా జడ్జిలు వి.బి. నిర్మలా గీతాంబ, ఎం.ఆర్. సునీత, పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మహిళా స్వేచ్ఛ అనే అంశంపై ప్రొఫెసర్ ఇ. సుధారాణి, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనే అంశంపై ప్రొఫెసర్ గుగులోతు వీరన్న నాయక్, సామాజిక న్యాయం - బహుజనుల ఐక్యత అనే అంశంపై తెలుగు అకాడమీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రజాస్వామ్యంలో జడ్జీల నియామకం - లోపాలు అనే అంశంపై ఐఎల్పీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ ఉపన్యాసాలు ఇస్తారని తెలిపారు. వీరితో పాటు ఐఎల్పీఏ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.జె. శాంసన్, బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాసురాం నాయక్, రాష్ట్రీయ ముక్తి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ మహమ్మద్ ఫహీమొద్దీన్, బ్యాన్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. నరేందర్ తదితర మేధావులు హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎల్పీఏ రాష్ట్ర కమిటీ సలహాదారు బండి మొగిలి, సభ్యులు ఎగ్గడి సుందర్ రామ్, జన్ను పద్మ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విలాసాగరం సురేందర్ గౌడ్, గురిమిల్ల రాజు, ఐఎల్పీఏ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పులిగిల్ల బిక్షపతి, చింత సాంబశివరావు, ఐఎల్పీఏ హనుమకొండ బార్ అధ్యక్ష, కార్యదర్శులు పూసపెల్లి శ్రీనివాస్, నాంసాని చంద్రశేఖర్, ఐఎల్పీఏ బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెండ్యాల అనిల్, అనుమాండ్ల రాజ్ కుమార్, ఐఎల్పీఏ జిల్లా నాయకులు జన్ను ప్రభాకర్, కలకోటి మహేందర్, అబ్దుల్ నభి, కట్కూరి సూరయ్య, అఖిల్ పాషా, కృష్ణ, గట్టు రవి తదితరులు హాజరయ్యారు.






