చిత్తూరు, 12 November
దేశీయ ఎఫ్ఎంసీజీ, పొగాకు ఉత్పత్తుల దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ తమ సిగరెట్ బ్రాండ్ గోల్డ్ ఫ్లేక్ ప్రిమియం ధరలను పెంచింది.
ధూమపానం చేసేవారి జేబులకు మళ్లీ చిల్లు పడనుంది దేశీయ ఎఫ్ఎంసీజీ, పొగాకు ఉత్పత్తుల దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ తమ అత్యంత ప్రజాదరణ పొందిన సిగరెట్ బ్రాండ్ గోల్డ్ ఫ్లేక్ ప్రిమియం ధరలను మరోసారి పెంచింది. ఒక్కో ప్యాకెట్‌పై ఏకంగా రూ. 10 చొప్పున ధర పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. 10 సిగరెట్లు ఉండే గోల్డ్ ఫ్లేక్ ప్రిమియం (రెగ్యులర్ సైజ్ ఫిల్టర్ - 60-70 ఎంఎం) ప్యాకెట్ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్పీ) ప్రస్తుతం ఉన్న రూ. 125 నుంచి రూ. 135కు చేరింది. ఇది దాదాపు 8 శాతం పెంపునకు సమానం. పెరిగిన కొత్త ధరలతో కూడిన ప్యాకెట్లు నవంబర్ నాలుగో వారం నాటికి రిటైల్ మార్కెట్లకు, సప్లై వేర్‌హౌస్‌లకు చేరుకుంటాయని వ్యాపారులు వెల్లడించారు.
ప్రస్తుత 2026వ సంవత్సరంలో గోల్డ్ ఫ్లేక్ ప్రిమియం సిగరెట్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్ నెలలో 10 సిగరెట్ల ప్యాకెట్ ధరను రూ. 115 నుంచి రూ. 125కు పెంచారు. నాటి రేటుతో పోలిస్తే ఇప్పటివరకు ఈ ఒక్క ఏడాదే ఈ బ్రాండ్ సిగరెట్ల ధరలు ఏకంగా 17.4 శాతం మేర ప్రియమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై విధిస్తున్న అధిక పన్నుల భారం, దేశీయ మార్కెట్లోకి విదేశాల నుంచి అక్రమంగా స్మగ్లింగ్ అవుతున్న బ్రాండ్ల విక్రయాలు పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పన్నులు భారీగా పెరగడంతో చట్టబద్ధమైన సిగరెట్ల విక్రయ పరిమాణం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
ఈ ప్రభావం కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీసీ సిగరెట్ వ్యాపార లాభం గత ఏడాదితో పోలిస్తే 27.2 శాతం పడిపోయి రూ. 3,813 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 5,241 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అలాగే నికర సిగరెట్ ఆదాయం కూడా 21 శాతం క్షీణించింది.
ఐటీసీ మొత్తం సిగరెట్ల విక్రయ ఆదాయంలో ఒక్క గోల్డ్ ఫ్లేక్ ప్రిమియం (రెగ్యులర్ సైజ్ విభాగం) వాటానే దాదాపు 46 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. కంపెనీకి అత్యధిక లాభ మార్జిన్లు (దాదాపు 70 శాతం) తెచ్చిపెట్టే వ్యాపారాల్లో సిగరెట్ల విభాగమే ప్రాథమికమైనది.
ప్రభుత్వ పన్నుల భారాన్ని తట్టుకుంటూనే, వినియోగదారులు చవకగా లభించే అక్రమ సిగరెట్ బ్రాండ్ల వైపు మళ్లకుండా నిరోధించేందుకు ఐటీసీ జాగ్రత్తగా ఈ ధరల పెంపు వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్మగ్లింగ్ సిగరెట్లకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త వేరియంట్లను, సరికొత్త బ్రాండ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఐటీసీ యోచిస్తోంది.

