వేములవాడ పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచి, పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు సూచించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ లోకేష్ ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుధ్య తనిఖీ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతిరోజూ చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రహదారులు, మురుగు కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్య కార్మికులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, పారిశుధ్య సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిశుభ్రత కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరిస్తేనే పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పారిశుధ్య తనిఖీ అధికారి సుకుమార్, మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు.

