బాసర, 11 November
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమైన, శుద్ధి చేసిన సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్, విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వసతి గృహాలు, ప్రాంగణంలో నీటి సరఫరా పరిస్థితులు, తాగునీటి సమస్యలు, ఇతర ఇబ్బందులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, నీరు కలుషితమవుతున్న ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. శుద్ధి చేసిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలని, తాగునీటితో పాటు నిత్యావసరాలకు అవసరమైన నీరు కూడా నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ట్రిపుల్ ఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






