హైదరాబాద్, 10 November
దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తూనే సాహిత్య రంగంలోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్న డా. పెరుక రాజు రచించిన 14వ కవితా సంపుటి జవాన్ ను తెలంగాణ ప్రభుత్వ సైనిక్ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు హైదరాబాద్లో ఆవిష్కరించారు. సైనికుల అనుభవాలు, దేశభక్తి, మానవీయ విలువలను ప్రతిబింబించే ఈ సంపుటి అభినందనీయమని ఆయన కొనియాడారు.
దేశవ్యాప్తంగా సాహిత్యాభిమానులకు సుపరిచితులైన ప్రముఖ జాతీయ కవి, రచయిత, విమర్శకుడు, బహుభాషావేత్త, సామాజిక సేవకులు, మై గిఫ్ట్ స్వచ్ఛంద సంస్థ రూపశిల్పి డా. పెరుక రాజు రచించిన 14వ సాహితీ సంపుటి జవాన్ (కవిత్వం)ను తెలంగాణ ప్రభుత్వ సైనిక్ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు హైదరాబాద్లోని తన కార్యాలయ చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు మాట్లాడుతూ, దేశ రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే సాహిత్య సృజనలోనూ విశేష ప్రతిభ కనబరచడం డా. పెరుక రాజు ప్రత్యేకత అని కొనియాడారు. సైనికుడి జీవితంలోని అనుభవాలు, భావోద్వేగాలు, దేశభక్తి, త్యాగనిరతి, మానవీయ విలువలకు తన కలం ద్వారా అక్షరరూపం ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. జవాన్ అంతరంగాన్ని ప్రతిబింబించే ఈ కవితా సంపుటిని తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఆవిష్కరించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. సైనిక విధుల ఒత్తిడితో కూడిన బాధ్యతల మధ్య కూడా ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి ఇంతటి సాహిత్య సృజన చేయడం అసాధారణమైన విషయమని ప్రశంసించారు.
సైన్యంలో కొనసాగడం గన్నుతో పెట్టిన విద్య, సాహితీ సాగు చేయడం పెన్నుతో పెట్టిన విద్య, ఈ రెండూ రాజుకు వెన్నతో పెట్టిన విద్యలు అంటూ ఆయన చేసిన ప్రశంసలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సమాజానికి మార్గదర్శకంగా నిలిచే ఇలాంటి విలువైన రచనలు మరిన్ని వెలువరించాలని ఆకాంక్షించారు. త్వరలో వెలువడనున్న డా. పెరుక రాజు ఆంగ్ల కవితా సంపుటి ను కూడా ప్రతి ఒక్కరూ చదివి, అందులోని మానవీయ సందేశాలను ఆకళింపు చేసుకోవాలని సూచించారు.
రచయిత పరిచయం
భారతమాత గర్వించే తెలంగాణ బిడ్డగా, భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ అధికారిగా సేవలందిస్తున్న డా. పెరుక రాజు సైనిక జీవితంతో పాటు సాహిత్య రంగంలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జాతీయ కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, బహుభాషావేత్తగా తెలుగు సహా పలు భారతీయ భాషల మధ్య సాహిత్య, సాంస్కృతిక వారధిగా నిలుస్తూ జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందారు. ఇప్పటివరకు తెలుగు, ఆంగ్లం సహా పలు భారతీయ భాషల్లో ఎన్నో సాహితీ సంపుటాలను వెలువరించి తన సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.
సామాజిక సేవ
సాహిత్య సేవతో పాటు సామాజిక సేవలోనూ ఆయన విశేష కృషి చేస్తున్నారు. 2000 సంవత్సరంలో స్థాపించిన మై గిఫ్ట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద, నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రోత్సహించడమే గొప్ప బహుమతి అనే ఆశయంతో కళాకారులకు అండగా, విద్యార్థులకు ప్రోత్సాహంగా నిలుస్తూ ఆయన సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.


