నిర్మల్ జిల్లా మండలంలోని ఝరి బి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సాయి కృష్ణ, రోజా రాణి, దీపిక విద్యార్థులను ఆయిల్ పామ్ తోటకు తీసుకెళ్లారు. అక్కడ పంట సాగు విధానం, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ, దిగుబడి వంటి అంశాలపై వారికి వివరించారు.
రైతుల ద్వారా విద్యార్థులకు ఆయిల్ పామ్ సాగు విశేషాలను ప్రత్యక్షంగా తెలియజేశారు. పుస్తకాలలో చదివిన విషయాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించడం వల్ల విద్యార్థుల్లో వ్యవసాయంపై ఆసక్తి, జిజ్ఞాస, పరిశీలనా శక్తి పెరుగుతాయని ఉపాధ్యాయులు తెలిపారు.
రైతులు పడుతున్న కష్టం, వ్యవసాయం ప్రాధాన్యత, ఆహార ఉత్పత్తిలో రైతుల పాత్రను చిన్నతనం నుంచే విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఇలాంటి క్షేత్రస్థాయి విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించడంతో పాటు రైతుల పట్ల గౌరవం, ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు.











