మియాపూర్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మొగుణ్ని కొట్టి దివాన ఎక్కినట్లు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు.
మియాపూర్లోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు 100, 101 పరిధిలో సుమారు 550 ఎకరాల భూమి ఉందని, దీని విలువ సుమారు రూ.60 వేల కోట్లకు పైగా ఉంటుందని విఠల్రావు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2015లో కేసీఆర్ ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినవారు, మధ్యవర్తులు, బ్రోకర్లు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.
2015 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీనియర్ న్యాయవాది వైద్యనాథ్ ఆధ్వర్యంలో ఉన్నత న్యాయస్థానంలో సుమారు 86 సార్లు వాదనలు జరిగాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 13 సార్లు వాదనలు జరిగాయని వివరించారు. 2023లో వెలువడిన తీర్పునకు అనుగుణంగా తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ భూములు ప్రభుత్వానివేనని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాటు న్యాయపోరాటం చేసి ప్రభుత్వ భూములను కాపాడిన కేసీఆర్ పై ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మియాపూర్ భూముల విషయంలో గతంలో ఎప్పుడైనా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఆధారాలు లేవని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు అందకముందే భూముల విక్రయానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి, ఆయన సోదరుడికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు, కమీషన్లపై ఆసక్తి ఉందంటూ ఆరోపించారు.
ప్రభుత్వ భూములను విక్రయించడం కాకుండా భూమిలేని నిరుపేదలకు, జర్నలిస్టులకు పంపిణీ చేయాలని విఠల్రావు డిమాండ్ చేశారు. కరువు మండలాల ప్రకటనలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. వ్యవసాయ క్షేత్రాల సర్వేల ఆధారంగా కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల వారీగా కరువు మండలాలను ప్రకటించడం సరికాదన్నారు. వివక్షపూరిత నిర్ణయాలు, ఏకపక్ష రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దాదన్నగారి విఠల్రావు డిమాండ్ చేశారు.











