రంగా జిల్లా షాద్‌నగర్‌లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మరియు ఇండిగో రీచ్ సంయుక్తంగా అత్యాధునిక ఇండిగో రీచ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాయి. గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం.
షాద్‌నగర్‌లో గ్రామీణ యువత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తూ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మరియు ఇండిగో రీచ్ సంయుక్తంగా ఈ అత్యాధునిక ఇండిగో రీచ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను నెలకొల్పాయి. ఈ సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ కు ప్రత్యేక ఆహ్వానం లభించడం విశేషం. మారుమూల గిరిజన గ్రామాల నుండి నిరుద్యోగ యువతను గుర్తించి, వారికి నాణ్యమైన శిక్షణ ఇప్పించి, ఇండిగో ఎయిర్‌లైన్స్ వంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా చేస్తున్న ఆయన అంకితభావాన్ని గుర్తించి ఈ ఆహ్వానం పలికారు.
ప్రథమ్ ఫౌండేషన్ సీఈఓ మీనాక్షి రమేష్ గారి ప్రత్యేక సూచనలతో, సెంట్రల్ హెడ్ దీప్తి మేడమ్ ఆధ్వర్యంలోని ఉన్నత బృందం పసుల రమేష్‌ను వేదికపైకి ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సత్కరించింది. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతం నుండి 180 మందికి పైగా యువతకు ఉపాధి కల్పించడం మామూలు విషయం కాదు. రమేష్ కృషి మా సంస్థకే స్ఫూర్తి అని ఫౌండేషన్ ప్రతినిధులు వేదికపై కొనియాడారు. ఈ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్, హోటల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఇండిగో ఎయిర్‌లైన్స్, తాజ్, ఐటీసీ వంటి 5-స్టార్ హోటళ్లలో నెలకు రూ.18,000 నుండి రూ.35,000 జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఈ ఒక్క సెంటర్ ద్వారా ఏడాదికి 2000 మంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా వేలాది మంది నిరుద్యోగ యువత ఉన్నారని, ఇండిగో వంటి సంస్థలో ఉద్యోగం అంటే జీవితం సెటిల్ అయినట్టేనని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ్, ఇండిగో రీచ్ ఉన్నతాధికారులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.










