బ్రిటన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో దసరా, బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్న తెలుగు వారిపై జాత్యహంకారంతో కూడిన దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక తెలుగు హిందూ సంఘాలు ఒస్సెట్ టౌన్ హాల్లో వేడుకలు నిర్వహిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది.
బ్రిటన్‌లో తెలుగు సమాజానికి చేదు అనుభవం ఎదురైంది. దసరా, బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్న సమయంలో కొందరు ఆకతాయిలు జాత్యహంకారంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తెలుగు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక భారతీయులను, ముఖ్యంగా తెలుగు వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వెస్ట్ యార్క్‌షైర్‌లోని ఒస్సెట్ టౌన్ హాల్ వేదికగా స్థానిక తెలుగు హిందూ సంఘాలు దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో సుమారు 25 మంది బ్రిటీష్ యువకులు ఈ-బైక్‌లపై వచ్చి హాల్ వద్ద గొడవ చేసేందుకు యత్నించారు. లోపల ఏం జరుగుతోందో, ఎవరున్నారో ఆరా తీస్తూ హాల్లోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని చాకచక్యంగా అడ్డుకుని బయటకు పంపేశారు.
లోపలికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో సదరు ఆకతాయిల గుంపు బయటే కాపు కాసింది. రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తన మిత్రుడితో కలిసి వేడుక ముగించుకుని పార్కింగ్ చేసిన కార్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే ముఖాలకు మాస్కులు ధరించిన 8 నుంచి 10 మంది బ్రిటీష్ యువకులు వీరిని చుట్టుముట్టారు. ఇక్కడేం చేస్తున్నారు అని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగారు. గొడవ వద్దనుకుని వారు తిరిగి టౌన్ హాల్ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చి పిడిగుద్దులతో దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాద్ వ్యక్తి ముఖానికి, కంటికి తీవ్ర గాయాలవ్వగా, ఆయన మిత్రుడి తలకు, చేతికి తీవ్ర రక్తస్రావమైంది.
ఈ ఘటనపై స్థానిక హెచ్డీఆర్ పరిధిలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడిని జాత్యహంకార కోణంలోనే విచారిస్తున్నట్లు తెలిపారు. హిందూ సమాజంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించిందని, నిందితులను వదిలిపెట్టేది లేదని ఇన్స్పెక్టర్ ఆండ్రూ డికిన్సన్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.












