ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల రెండో అంకం మొదలైంది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు మొదలుకానున్నాయి. ఏపీలోని కీలక కార్పొరేషన్లలో వార్డుల పంపకాలు మూడు పార్టీల మధ్య పూర్తి కావడంతో కూటమి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో అంకం మొదలైంది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు మొదలుకానున్నాయి. ఏపీలోని కార్పొరేషన్లలో వార్డుల పంపకాలు మూడు పార్టీల మధ్య పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఏ పార్టీకి ఎక్కడ ఎక్కువ సీట్లు అనేది స్పష్టమైంది.
ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కూటమిలోని టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య మేయర్, మున్సిపాలిటీలకు సీట్ల పంపకాలు పూర్తి అయినా, వార్డుల షేరింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. పలు ప్రాంతాల్లో ఈ మూడు పార్టీలకు చెందిన రెబెల్స్‌గా బరిలోకి దిగడంతో, 100 శాతం విజయం సాధించాలన్న కూటమి ఆశలకు కొంత ఆటంకం ఏర్పడింది.
కీలకంగా మారిన విశాఖ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లలో కూటమి పార్టీల మధ్య వార్డుల పంపకాలు పూర్తి కావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఒకే వార్డులో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలకు చెందిన ఆశావహులు నామినేషన్లు వేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో అభ్యర్థుల విషయంలో రెబల్స్ నుండి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరిగింది.
విశాఖ కార్పొరేషన్లో మొత్తం 120 వార్డులకు గాను టీడీపీ 80, జనసేన 30, బీజేపీ 10 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. ఖరారైన సీట్లకు పార్టీలు ఆయా అభ్యర్థులకు బీ ఫారమ్ ఇచ్చాయి. జీవీఎంసీ 120 వార్డుల్లో టీడీపీ నుంచి 504, జనసేన 278, బీజేపీ 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కనీసం 34 సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబట్టగా, చివరకు 30 సీట్లు ఇచ్చినట్టు సమాచారం. కార్పొరేటర్ అభ్యర్థులకు సరైన న్యాయం జరగకపోవడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చాలామంది నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 86 డివిజన్లు ఉన్నాయి. అందులో టీడీపీ 57, జనసేన 21, బీజేపీ 8 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. 86 డివిజన్లలో ఏకంగా 52 చోట్ల రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నేతలను ఇప్పటికే హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వారితో మంతనాలు సాగించడంతో పలువురు రెబెల్స్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా పలువురు రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీటు ఏ పార్టీకి దక్కినా మిగతా రెండు పార్టీల మద్దతు తప్పనిసరి అయ్యింది. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోని నేతలపై సస్పెన్షన్ వేటు పడనుంది.
తిరుపతి కార్పొరేషన్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. తిరుపతి కార్పొరేషన్‌కు 66 వార్డులు ఉండగా, టీడీపీ 39, జనసేన 22, బీజేపీ 5 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. ఎక్స్ అఫీషియో ఓ స్థానాన్ని కేటాయించారు. కూటమి నేతలు గడిచిన మూడు నాలుగు రోజులు పలు విడతలుగా సమావేశమై నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. మిగిలిన వారితో నామినేషన్ల ఉపసంహరణ కోసం మంతనాలు చేశారు.


