మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులపై దాడులు జరిగాయని, నామినేషన్లు దాఖలు చేయకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించారు. తాజాగా, పుర పోరులో తమ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, బెదిరింపులకు గురిచేస్తూ నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభ్యర్థులు సురక్షితంగా పత్రాలు సమర్పించేందుకు వీలుగా నామినేషన్ల గడువును పొడిగించాలని, అదనపు లేదా ప్రత్యామ్నాయ నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరింది.
అలాగే ఏకగ్రీవ ఎన్నికల ఫలితాల ప్రకటనపై స్టే విధించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. నామినేషన్ గడువును పొడిగించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఆదివారం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంగనూరు, రాయచోటి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను, టీడీపీ శ్రేణులు నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలను ప్రస్తావించింది. అదే విధంగా లో ఒక అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారని, తిరుపతిలో పోటీ చేస్తున్న తొమ్మిది మంది అభ్యర్థులను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అలాగే 22 స్థానిక సంస్థల పరిధిలోని 809 వార్డులకు కేవలం 321 స్థానాల్లో మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు దాఖలు చేయగలిగిందని, దాడుల భయంతో మిగిలిన 488 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న 22 మున్సిపాలిటీల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని లేదా ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది.
కాగా ఏపీలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర పారామిలట్రీ బలగాలను మోహరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి కేంద్ర బలగాలు అవసరం ఉందని, రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తొలుత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి దానిని కొట్టేశారు. ఆ తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28న మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదుకూరులో కొన్ని వార్డుల్లో నామినేషన్ పత్రాలు చిరిగిపోవడంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్వయంగా వెల్లడించారు. సోమవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై కొన్ని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, మైదుకూరులో నామినేషన్ పత్రాలు చిరిగిపోవడంతో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

