నాటి తరం విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని దారి చూపిన మార్గదర్శి విశ్రాంత ఉపాధ్యాయుడు జి. నరసయ్య అని నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఇటీవల స్వర్గస్తులైన నరసయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను సత్యనారాయణ గౌడ్ పరామర్శించారు.
నిర్మల్ పట్టణంలోని వివేక్ నగర్ లోని నరసయ్య నివాసానికి శనివారం వెళ్లిన సత్యనారాయణ గౌడ్, ఆయన కుమారులు ప్రవాస భారతీయులు డాక్టర్ ఈశ్వర్, హరి ప్రసాద్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి, శ్రద్ధాంజలి ఘటించారు.
నరసయ్య తనకు గురువు అని, ఉపాధ్యాయుడిగా విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారని, మార్గ నిర్దేశం చేశారని, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు. ఆదర్శవంతమైన గురువుగా, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా విద్యార్థులు ఆంగ్లంలో రాణించాలని చక్కటి బోధన చేశారని అన్నారు.
ఆయన జీవితం, బోధన తీరు నేటి గురువులకు మార్గదర్శకమని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. సత్యనారాయణ గౌడ్ వెంట నరసయ్య శిష్యులు డాక్టర్ మురళీధర్ గుప్తా, విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట్రావు, శ్రీధర్, వేణుగోపాల్ ఉన్నారు.












