నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రజలను అధిక వడ్డీలతో ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ దాడుల్లో పలువురి నుంచి నగదు, చెక్కులు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు శనివారం ఉదయం నుండి పోలీసులు విస్తృతంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 67 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అప్పులు తీసుకున్న వారిని వేధింపులకు గురిచేసే అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన వడ్డీ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
అప్పుల పేరుతో ప్రజలను బెదిరించడం, బలవంతంగా చెక్కులు లేదా ఇతర పత్రాలు తీసుకోవడం, చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
బాధితులకు న్యాయం
ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి సమాచారం తెలిసినా, బాధితులుగా ఉన్నా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీస్ శాఖ సూచించింది.

