ఓటు హక్కును తొలగించడం అంటే మనిషి రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని, అది మనిషిని హత్య చేయడంతో సమానమని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి మెంగ లక్ష్మీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును పరిరక్షించడం ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఓటు ద్వారానే ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడంతోపాటు ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతారని తెలిపారు.
అర్హులైన పౌరుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం వల్ల వారు ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు జాబితాల తయారీ, సవరణ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు అన్యాయంగా తొలగిపోకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులకు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు తగిన అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని మెంగ లక్ష్మీ పిలుపునిచ్చారు.












