తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిపాస్తులు కాదు, ఆదర్శాలు, సంస్కారం, మానవీయ విలువలు అందించాలి. అలాంటి విలువలను తండ్రి నుంచి పుణికిపుచ్చుకొని విద్య, క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న యువతి పెరుక వృంద.
ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, బహుభాషావేత్త, భారత సైన్యంలో జూనియర్ అధికారి డా. పెరుక రాజు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రోత్సాహమే గొప్ప బహుమతి అనే నినాదంతో మై గిఫ్ట్ సేవా సంస్థకు రూపశిల్పిగా నిలిచి, తాను ఎక్కడ ఉంటే అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన నిరాడంబర జీవనానికి ప్రాధాన్యమిస్తారు. బాల్యంలో ఎదుర్కొన్న పేదరికాన్ని, కష్టాలను విజయానికి మెట్లుగా మలచుకున్నారు.
విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్, అక్షర ఉజ్వల కార్యక్రమాలతో పాటు ఎన్సీసీ క్యాడెట్‌గా సేవలందించిన ఆయన, అదే క్రమశిక్షణను తన పిల్లలకు అలవర్చారు. ఆ స్ఫూర్తితో ఎదుగుతున్న తనయ వృంద చిన్ననాటి నుంచే క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.
క్రీడల్లో వృంద ప్రతిభ
2013లో ఢిల్లీలో జరిగిన ఇంటర్ స్కూల్ సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకం, 2017లో తమిళనాడులో నిర్వహించిన ఇంటర్ స్కూల్ పోటీల్లో ప్రథమ స్థానంతో బెస్ట్ అథ్లెట్ పతకం సాధించింది. 2019లో వెల్లింగ్టన్ రాక్ క్లైంబింగ్ సమ్మర్ క్యాంపులో ప్రథమ స్థానం, 202223లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ఇంటర్ కాలేజ్ క్రీడా పోటీల్లో పలు పతకాలు కైవసం చేసుకొని తన ప్రతిభను చాటుకుంది.
విద్యా, ఎన్సీసీ, సాంస్కృతిక రంగాల్లో
ప్రస్తుతం గీతం విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతున్న వృంద, 2025 నుంచి ఎన్సీసీ క్యాడెట్‌గా కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు శిబిరాల్లో పాల్గొని పలు ప్రశంసాపత్రాలు అందుకుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది.
తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో నివసించిన అనుభవంతో వృందకు విభిన్న భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలపై అవగాహన ఏర్పడింది. తండ్రిలాగే పలు భాషలపై ఆసక్తిని పెంపొందించుకుంది. ఎన్ని విజయాలు సాధించినా వినయంగా ఉండటం, పెద్దలను గౌరవించడం ఆమె వ్యక్తిత్వానికి వన్నె తెస్తున్నాయి.
తండ్రి అక్షరాలతో హృదయాలను గెలుస్తుంటే, తనయ ప్రతిభతో పతకాలు గెలుస్తోంది. తండ్రి సేవతో సమాజంలో ఆదరణ పొందుతుంటే, తనయ సాధనతో ప్రశంసలు అందుకుంటోంది. తండ్రి ఆదర్శం ఆమెకు పునాది, స్వయంకృషి ఆమెకు విజయాల నిచ్చెన. వారసత్వంగా అందుకున్నది సంపద కాదు, సంస్కారం. ఆ సంస్కారానికి ప్రతిరూపమే పెరుక వృందతండ్రికి తగిన తనయ








