నిజామాబాద్ నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా వివిధ దేవి మండపాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందూరు మహిళలు తమ ఇళ్లలోనూ సంప్రదాయబద్ధంగా నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు.
నవరాత్రుల తొలిరోజైన ఆదివారం, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తూ మహిళలు భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. ఇళ్లలోని దుర్గామాత చిత్రపటాలను పూలతో అందంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మహిళలు నిష్ఠతో నవరాత్రి దీక్షలను కొనసాగిస్తున్నారు. ఆలయాలు, దేవి మండపాలతోపాటు ఇళ్లలోనూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా ఇందూరు మహిళలు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలు నగరంలో ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి.










