బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ ఆరోపించారు. హరీశ్‌రావు తన రాజకీయ ఉనికిని జిల్లా వారోత్సవాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నకోడూరులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మహేందర్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుని, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పేరుతో పేదల ఓటు హక్కును హరిస్తోందని విమర్శించారు. దీనిపై రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్ స్పందించకపోవడం బీజేపీతో ఆ పార్టీకి ఉన్న సంబంధాలను వెల్లడిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, ఇలాంటి అంశాలపై స్పందించకుండా హరీశ్‌రావు జిల్లా వారోత్సవాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిద్ధిపేట జిల్లా ప్రజలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. హరీశ్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే 23 జిల్లాల్లో వారోత్సవాలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, బాధిత రైతులకు సరైన పరిహారం అందించలేదని ఆరోపించారు. జీవో 59 పేరుతో దళితుల భూములను తీసుకుని ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని హరీశ్‌రావు, ఆయన అనుచరులపై విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై సిద్ధిపేట ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే విలేకరుల భూములను సైతం లాక్కున్నారని ఆరోపించారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిద్ధిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఎన్ని ఒప్పందాలు, రాజకీయ ఎత్తుగడలు వేసినా సిద్ధిపేట ప్రజలు బీజేపీని, హరీశ్‌రావును నమ్మరని అన్నారు. రాబోయే సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పొన్నాల రాజేష్, ఉడుత జయంత్, అంతగిరి చంద్రశేఖర్, గొట్టిపర్తి చందు, ద్యావ రమేష్ తదితరులు పాల్గొన్నారు.












