తిరుమలలో భక్తుల వసతి కోసం ఏర్పాటు చేసిన కర్ణాటక సత్రాల నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ సత్రాలను పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ విషయంపై ప్రశ్నలు లేవనెత్తారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న కర్ణాటక ప్రవాస సౌధాలు ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారాయి. మైసూరు మహారాజుల కాలం నుంచి తిరుమలతో కర్ణాటకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే భక్తుల వసతి కోసం కర్ణాటక సత్రాలు ఏర్పాటయ్యాయి. అయితే, ఈ సత్రాల నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటక సంస్థ అధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలను పర్యాటక సంస్థకు అప్పగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మించిన భవనాలకు టీటీడీ అనుమతులు ఉన్నాయా, గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలేంటి అని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంపై టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరాలు కోరినట్లు సమాచారం. గతంలో కుదిరిన ఒప్పందాలు, భూమి కేటాయింపు పత్రాలు, నిర్మాణ అనుమతులను పరిశీలించిన తర్వాతే టీటీడీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

