ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఓని సంజీవరావు, ఆలయ విధులకు ఎగనామం పెట్టి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘన
నిబంధనల ప్రకారం ఆలయ సూపరింటెండెంట్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆలయం మూసే వరకు ఆలయంలోనే అందుబాటులో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంది. ముఖ్యంగా దసరా రద్దీ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. కానీ సూపరింటెండెంట్ ఇలా బజార్ లో తిరగడం సరికాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
గతంలోనూ ఆరోపణలు
ఓని సంజీవరావు బాసర గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో తరచూ ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, గ్రామస్తులతో కలివిడిగా ఉంటూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి.
ఈవో స్పందన
ఈ విషయంపై ఆలయ ఈవో అంజనాదేవిని వివరణ కోరగా.. డ్యూటీ సమయంలో ఎవరూ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఇప్పటికే అందరికీ ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలను పరిశీలిస్తాం. వాస్తవం తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని ఆమె స్పష్టం చేశారు.










