మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసె రమేష్ యాదవ్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ చేసిన విమర్శలను ఖండించారు. ముఖ్యమంత్రి సిరిసిల్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణ సరికాదని, గతంలో చంద్రశేఖర రావు సభలు పోలీసుల ప్రమేయం లేకుండానే జరిగాయా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. గతంలో మీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, రెండు లక్షల రుణమాఫీలో అనేక ఉమ్మడి కుటుంబాలు నష్టపోయాయని ఆయన ఆరోపించారు. దీనికి మీరే బాధ్యత వహించాలని, అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయని అనేక సంక్షేమ పథకాలను తమ ప్రజా ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోందని అన్నారు. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలోనైనా పేద ప్రజలకు ఇళ్లు ఇచ్చారా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినా, ఆ హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.
దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి సిరిసిల్లలో సభ నిర్వహించి, గత ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని చెప్పడం తప్పేమీ కాదని అన్నారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే మంచిదని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, వేణు నగర్ సర్పంచ్ టేకం భీమ్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోకల మహేందర్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












