మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల రక్షణ వంటి పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాటలు, నాటకాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో పోలీస్ కళాబృందం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం చట్టపరంగా నేరమని కళాబృందం వివరిస్తోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 1908కు తెలియజేయాలని సూచిస్తోంది.
రోడ్డు భద్రతపై సూచనలు
హెల్మెట్ ధరించకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్రూట్లో ప్రయాణించడం వంటి వాటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
మహిళల రక్షణకు షీ టీమ్
మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, మహిళలకు ఏదైనా అసౌకర్యం ఎదురైతే షీ టీమ్ నంబర్ 87126-59795 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత
ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సందర్భంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించి తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవచ్చని వివరిస్తున్నారు.
అలాగే మూఢనమ్మకాలు, చైన్ స్నాచింగ్‌ల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి సంరక్షణ, యువత చెడు మార్గాలకు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కళాబృందం అవగాహన కల్పిస్తోంది.
నిజామాబాద్ పోలీస్ కళాబృందం నుంచి ఇప్పటివరకు 106 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. పాటలు, నాటకాలతో ప్రజలను ఆకట్టుకుంటూనే సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించడం కళాబృందం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


