షాద్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాజన సర్వసభ్య సమావేశంలో సంఘం చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.కోటి మేర రైతులకు రుణాలు పంపిణీ చేయగా, రూ.23 లక్షల విలువైన డెయిరీ రుణాల చెక్కులను రైతులకు అందజేశారు.
షాద్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. సంఘం చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం ప్రగతి, రైతులకు అందించిన రుణాలు, భవిష్యత్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను సకాలంలో అందిస్తూ సహకార సంఘం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతులు తీసుకున్న రుణాలను నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు. సహకార సంఘాన్ని కేవలం రుణాల పంపిణీకే పరిమితం చేయకుండా బహుళ ప్రయోజన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గోదాముల నిర్మాణం, వ్యవసాయ యంత్రాల కోసం కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, డిజిటల్ సేవలు వంటి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల నివేదికతో పాటు నూతన బడ్జెట్ తీర్మానాలను మహాజన సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్మన్ తెలిపారు. సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో పాలకవర్గం, సిబ్బంది, రైతు సభ్యులు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు దాదాపు రూ. కోటి మేర రైతులకు రుణాలు అందించినట్లు చల్లా శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా డెయిరీ రుణాల కింద రూ. 23 లక్షల విలువైన చెక్కులను దుస్కల్ గ్రామానికి చెందిన రైతు కరుణాకర్ రెడ్డి, ఎలికట్ట గ్రామానికి చెందిన రైతు జి. రాములుకు పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు తుపాకుల శేఖర్, డైరెక్టర్లు అంబటి విజయ్ కుమార్, గుండ్రాతి వినయ్ గౌడ్, సందుగారి లక్ష్మీకాంత్ రెడ్డి, లంకాల రఘు గౌడ్, నాగి సాయిలు, చాకలి రత్నమ్మ, ఎండి హైదర్ గోరి, చిట్టి శ్రీధర్ రెడ్డి, పాట్లావత్ దాస్య నాయక్, వళ్ళు రాజేందర్ రెడ్డి, లింగారం అమృత, సంఘం కార్యదర్శి కే. రఘునందన్, సంఘం సిబ్బంది, రైతు సభ్యులు పాల్గొన్నారు.












