సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా మార్పిడి, అవగాహన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన నిర్మల్ జిల్లా బైంసా మండలం లోని వానల్పహాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మాదరి యెల్లన్నను వానల్పహాడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఉద్యోగులు శాలువా, పుష్పగుచ్ఛంతో ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. వానల్పహాడ్ వంటి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు సింగపూర్ వంటి అంతర్జాతీయ వేదికకు వెళ్లి, అక్కడి ఆధునిక విద్యా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించడం గ్రామానికే గర్వకారణమని అన్నారు. అక్కడ నేర్చుకున్న ఉత్తమ బోధనా పద్ధతులను గ్రామీణ విద్యార్థుల అభ్యసనకు ఉపయోగించేందుకు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఆధునిక విద్యా విధానాలపై అవగాహన
సింగపూర్ పర్యటనలో సృజనాత్మకత, ఆవిష్కరణ, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, బొమ్మల ఆధారిత బోధన, ఆటలు, కథలు, వివిధ కార్యక్రమాల ద్వారా అభ్యసనం, సమాచార సాంకేతికత వినియోగం, విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, సహచర అభ్యసనం, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని మాదరి యెల్లన్న తెలిపారు. ప్రత్యేకంగా సెయింట్ పాట్రిక్స్ పాఠశాలను సందర్శించి, విద్యార్థుల చురుకైన భాగస్వామ్యం, ఆసక్తి, విద్యార్థి కేంద్రిత బోధన, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, పాఠశాల వాతావరణం వంటి అంశాలను పరిశీలించినట్లు వివరించారు.
గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం
సింగపూర్లో నేర్చుకున్న విషయాలను వ్యక్తిగత అనుభవంగా మాత్రమే పరిమితం చేయకుండా, వానల్పహాడ్ గ్రామ విద్యార్థులకు ఉపయోగపడే విద్యా అవకాశాలుగా మార్చడమే తన లక్ష్యమని మాదరి యెల్లన్న తెలిపారు. సింగపూర్లో చూసిన మంచి బోధనా పద్ధతులను తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆచరణలోకి తీసుకువస్తానని ఆయన అన్నారు. గ్రామీణ విద్యార్థులకు కూడా ప్రపంచస్థాయి ఆలోచనా విధానాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తన పాఠశాలలో ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తూ, ఆటలు, కథలు, పాటలు, బొమ్మలు, స్థానిక వనరులతో ఆనందదాయకమైన బోధన, అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానానికి కార్యాచరణ ఆధారిత అభ్యసనం, సంకేత చిత్రాలు, అంతర్జాల ఆధారిత విద్యా విషయాలు, దృశ్య బోధన, సమాచార సాంకేతికత వినియోగాన్ని పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సహచర అభ్యసనం, విద్యార్థుల చురుకైన భాగస్వామ్యం, నిరంతర మూల్యాంకనం, గ్రంథాలయ వినియోగం, సమగ్ర విద్య, విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, వ్యక్తిత్వ వికాసానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.
మన పిల్లలు కూడా ప్రపంచాన్ని నేర్చుకోవాలి
గ్రామీణ విద్యార్థులకు అవకాశాలు తక్కువ అనే భావనను తొలగించాలని మాదరి యెల్లన్న అన్నారు. అవకాశం లభిస్తే గ్రామీణ విద్యార్థులు కూడా తమ ప్రతిభను చాటగలరనే నమ్మకాన్ని వారిలో పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సింగపూర్ పర్యటన ద్వారా పొందిన అనుభవాలను తన పాఠశాల విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో పంచుకుని, సమిష్టి వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్జాతీయ విద్యా మార్పిడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డాక్టర్ యోగితా రాణా, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంచాలకుడు జి. రమేష్తో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, సముదాయ ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సహచర ఉపాధ్యాయులకు మాదరి యెల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కడారి దశరథ్, కోశాధికారి గణపతి, అట్టోలి భూమన్న, ఆర్మీ జీవన్, శ్రావణ్రెడ్డి, జనార్ధన్, సాయిరెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












