నిర్మల్ జిల్లా మండలం బెంబర్ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి వ్యవసాయ కొట్టంలో కట్టివేసిన లేగదూడపై దాడి చేసి చంపడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే చిరుతను బంధించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
బెంబర్ శివారులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు చోక్క బోట్లు సాయినాథ్ తన వ్యవసాయ కొట్టంలో కట్టివేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది. బుధవారం ఉదయం లేగదూడను పరిశీలించగా, అది రక్తపు మడుగులో పడి మృతి చెంది కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి నిత్యం ఈ ప్రాంతంలో సంచరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని గ్రామస్థులు తెలిపారు. చిరుతపులి సంచారంపై ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్థులు, దానిని వెంటనే బోను ఏర్పాటు చేసి బంధించాలని అటవీశాఖ అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. గ్రామస్థుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


