భైంసా మండల కేంద్రంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ పక్షపాతానికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి గ్రామంలో తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని పవార్ రామారావు పటేల్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.







