గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన టయోటా ఫార్చ్యూనర్ కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కడంతో తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అహ్మదాబాద్‌లోని నికోల్ ప్రాంతంలో దేవాస్య ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పూనమ్‌బెన్ జితేంద్రభాయ్ నగ్వాడియా (30), తన 15 ఏళ్ల కుమారుడు సాగర్‌తో కలిసి ఫుట్‌పాత్‌పై సోఫా కవర్లు విక్రయిస్తున్నారు. దీపావళి నేపథ్యంలో వ్యాపారం చేస్తుండగా, వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్ కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.
అదే సమయంలో సోఫా కవర్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన కార్తీక్ వాసోయా (34), ఆయన భార్య స్నేహల్బెన్ (34) కూడా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, పూనమ్‌బెన్, సాగర్ మృతి చెందారు.
డ్రైవర్ అరెస్ట్, మద్యం సేవించి డ్రైవింగ్
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను విరల్ సవ్జిభాయ్ చౌదరి (36)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం వాహనాన్ని వదిలి పారిపోయిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా ఆరు బీర్ క్యాన్లు లభించాయి. వైద్య పరీక్షల్లో అతడి రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి అభియోగాలతో పాటు, గుజరాత్ మద్య నిషేధ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో వాహనం ఎంత వేగంతో ప్రయాణించిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.


