నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి, తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మొత్తం రూ. 6.32 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ. 4.72 కోట్లు, 15 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 1.60 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
మండల కేంద్రంలో గురువారం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ, గిరిజన పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పలుమార్లు పాఠశాలలను సందర్శించి సమస్యలు తెలుసుకుని, నిధుల మంజూరు కోసం సంబంధిత మంత్రికి విన్నవించామని, దాని ఫలితంగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
పాఠశాలల వారీగా నిధుల కేటాయింపు
భైంసా గిరిజన ఆశ్రమ పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ కోసం రూ. 1.90 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కుబీర్ మండలంలోని దోడర్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు రూ. 99 లక్షలు, తానూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు రూ. 1.73 కోట్లు కేటాయించామని, ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు
నియోజకవర్గంలోని 15 గిరిజన తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 1.60 కోట్లు మంజూరయ్యాయని, ఒక్కో హాళ్ నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయించామని ఎమ్మెల్యే తెలిపారు. కుభీర్ మండలంలోని రంగశివిని తండా, బ్రహ్మేశ్వర్ తండా, ఫకీర్ నాయక్ తాండ, దోడర్న తండా నెంబర్ 5, రంజని తాండ; మండలంలోని నరసింహ నగర్ తాండ, నగర్ తండా; తానుర్ మండలంలోని ఝరితండా, హిప్నల్లి తాండ, బామ్నీ తాండ; ముధోల్ మండలంలోని చింతకుంట తండా, ఎడ్ బిడ్ తండా, విట్టొలి తండా; కుంటాల మండలంలోని అంబకంటి తండా, హన్య తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వివరించారు.
ధన్యవాదాలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఆడ్లురి లక్ష్మణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు. గిరిజన పాఠశాలలు, తండాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.












