రాజన్న జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల కోసం ఉదయం పూట ఉచిత పులిహోర ప్రసాద వితరణను ఆలయ ఈవో రమాదేవి ప్రారంభించారు.
ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి నిర్వహించే అన్నపూజ అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా సోమవారం నుండి ఉదయం వేళల్లో ఉచిత పులిహోర వితరణను కూడా అందుబాటులోకి తెచ్చారు.
అధికారుల ఆదేశాలు
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఈవో రమాదేవి, దీపాల కౌంటర్ వద్ద టెండర్ దారులు ప్రమిదలను ఎంత రేటుకు విక్రయిస్తున్నారో నేరుగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులపై అదనపు భారం పడకుండా, నిర్ణయించిన రూ. 40 లకే దీపాలను అందించాలని కాంట్రాక్టర్కు స్పష్టమైన సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు నూగురి నరేందర్, ఎస్.పి.ఎఫ్ సిబ్బంది, హోంగార్డులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


