బైంసా, ముధోల్ నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపడుతున్న 28వ ప్యాకేజీ పనులపై అంచనాలు తయారు చేసి, తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భైంసాలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 28వ ప్యాకేజీకి 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పదేళ్లుగా ముందుకు సాగని ప్యాకేజీ పనుల పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, మిగిలిన పనులకు ఎంత నిధులు అవసరమవుతాయి అనే దానిపై చర్చించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా ముధోల్, తానుర్, కుభీర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని యోచిస్తున్నారు. గతంలో 48 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు అవసరమైన నిధులపై అధికారులు అంచనాలు రూపొందించి, తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
28వ ప్యాకేజీ పనులు పూర్తయితే, గోదావరి నది జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ముధోల్ నియోజకవర్గానికి తరలించి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చని ఎమ్మెల్యే పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్.ఇ. రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డి.ఇ. నవీన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.






