మార్కెట్, తమిళనాడు (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 12
25 కిలోల బియ్యం బస్తాలపై 5% జీఎస్టీ భారం నుంచి తప్పించుకునేందుకు, వ్యాపారులు 26 కిలోల బస్తాల విక్రయాలు పెంచుతున్నారు.
సాధారణంగా మార్కెట్లో 25 కిలోల బియ్యం బస్తాలు కనిపిస్తాయి. కానీ ఇటీవల 26 కిలోల బస్తాల విక్రయాలు భారీగా పెరిగాయి. దీని వెనుక పన్ను ఎగవేసే వ్యూహం దాగి ఉంది. 25 కిలోల లోపు ప్యాక్ చేసిన ఆహార ధాన్యాలపై 5 జీఎస్టీ ఉండటంతో, ఆ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి వ్యాపారులు లీగల్ మెట్రాలజీ నిబంధనలను ఉపయోగించుకుని బస్తా బరువును 26 కిలోలకు పెంచారు. ఈ చట్టపరమైన లొసుగు గురించి వివరాలు తెలుసుకుందాం. కిరాణా దుకాణాలకు లేదా సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు సాధారణంగా 25 కిలోల బియ్యం బస్తాలను కొనుగోలు చేస్తాం. దశాబ్దాలుగా మన మార్కెట్లో 25 కిలోల ప్యాకింగ్ ఒక ప్రామాణిక కొలతగా వస్తోంది. కానీ, ఇటీవల మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. చాలా దుకాణాల్లో 25 కిలోల బస్తాలకు బదులుగా 26 కిలోల బియ్యం బస్తాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినియోగదారులు అడగకపోయినా బరువును ఒక కిలో ఎందుకు పెంచారు అదనంగా ఒక కిలో పెంచి అమ్మడం వెనుక వ్యాపారులకు ఏదైనా ప్రత్యేక లాభం ఉందా అనే సందేహాలు చాలా మందికి రావచ్చు. దీని వెనుక వినియోగదారులను మోసం చేసే కుట్ర ఏమీ లేకపోయినా, పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి వ్యాపారులు వేసిన ప్రణాళిక దాగి ఉంది.
ఈ మార్పుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విధించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ప్యాకేజింగ్ నిబంధనలే. జులై 2022కి ముందు, బ్రాండెడ్ కాని ఆహార ధాన్యాలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ జులై 2022లో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నిబంధనలలో కీలక మార్పు చేసింది. ముందుగా ప్యాక్ చేసి, లేబుల్ వేసిన ఆహార ధాన్యాలు, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసర సరుకులపై 5 శాతం జీఎస్టీని విధించింది. అయితే, ఈ పన్ను విధింపులో ఒక చిన్న మినహాయింపును కూడా ఇచ్చింది. కేవలం 25 కిలోలు లేదా అంతకంటే తక్కువ బరువు ఉన్న ప్యాకేజీలపై మాత్ర శాతం పన్ను వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నియమమే ఇప్పుడు రైస్ మిల్లుల యజమానులకు, పెద్ద వ్యాపారులకు ఒక లొసుగుగా మారింది. 25 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే వాటిని రిటైల్ ప్యాకింగ్‌గా కాకుండా ఇండస్ట్రియల్ లేదా హోల్‌సేల్ ప్యాకింగ్‌గా పరిగణిస్తారు. ఈ చట్టపరమైన లొసుగును ఆసరాగా చేసుకున్న కొంతమంది రైస్ మిల్ యజమానులు తమ ప్యాకేజింగ్ విధానాన్ని మార్చేశారు. 25 కిలోల బస్తాకు బదులుగా 26 కిలోల బస్తాలను మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించారు. బస్తా బరువు 25 కిలోలు దాటగానే, దానిపై 5 శాతం జీఎస్టీ భారం పడదు. ఈ ఆలోచన మొదట తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్‌కు చెందిన ఒక రైస్ మిల్ యజమాని ద్వారా వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మిల్లర్లు, వ్యాపారులు ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించారని తెలిసింది.






