నిజామాబాద్, 2026-10-02
మహిళలు, చిన్నారుల భద్రత కోసం నిజామాబాద్ షీ టీమ్ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. జనవరి నుంచి 26 వరకు జిల్లాలో మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారించి, 154 వేధింపుల కేసులను నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు నిజామాబాద్ షీ టీమ్ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. జనవరి నుంచి 26 వరకు జిల్లాలో మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై షీ టీమ్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో మహిళల వేధింపులకు సంబంధించి 154 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాలు, ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్ బృందాలు ప్రత్యేక నిఘా కొనసాగించాయని వెల్లడించారు.
అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా యువతులు, విద్యార్థినులు, పని ప్రదేశాల్లో మహిళలకు మహిళా భద్రతపై 416 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. షీ టీమ్ బృందాలు 1,027 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా, 161 ఈ-పెట్టి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నమోదైన కేసుల్లో 61 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.
నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక నిఘా
దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్ బృందాలు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. వేడుకల ప్రాంతాల్లో మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
వివిధ అంశాలపై అవగాహన
అలాగే జిల్లాలోని 59 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలు, చిన్నారులకు మంచి స్పర్శచెడు స్పర్శ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
మహిళల సమస్యలకు సంబంధించి షీ టీమ్‌కు 62 ఫోన్ కాల్స్ రాగా, బాధితుల సమస్యలను తెలుసుకుని తగిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
మహిళలు, చిన్నారులకు రక్షణగా నిజామాబాద్ పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆపద సమయంలో షీ టీమ్ సేవలు పొందేందుకు 8712659795 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.











