మిర్యాలగూడ, 15 November
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగిస్తున్నామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆర్డిఓ రమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ప్రజా ప్రతినిధుల బాధ్యత
ప్రజా ప్రతినిధులుగా రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఒక ఎమ్మెల్యేగా ప్రతిరోజూ సుమారు 18 గంటల పాటు ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, నూతన పింఛన్ల లబ్ధిదారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


