సారంగాపూర్, 13 November
నిర్మల్ జిల్లాలోని ప్యారామూర్ గ్రామంలోని మూడు చెరువుల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక నాయకుడు రాష్ట్ర మంత్రిని కోరారు.
నిర్మల్ జిల్లా మండలం, ప్యారామూర్ గ్రామంలోని పసన్న చెరువు, ఊర చెరువు, భీమన్న చెరువుల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు, రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మూడు చెరువుల కింద సుమారు 800 ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రతి సంవత్సరం బాగా వర్షాలు పడినప్పుడు చెరువుల కట్టలు, తూములు దెబ్బతింటున్నాయని తెలిపారు. సరైన సమయంలో మరమ్మత్తులు చేయకపోవడంతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిందని, ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
మూడు చెరువుల కట్టల పటిష్టత, తూముల మరమ్మత్తులు, ఫీడర్ కాలువలు తదితర పనులకు నిధులు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. వినతి పత్రాన్ని సావధానంగా విన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రావుతో పాటు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ ఉమ మహేష్ రావు, వడ్లకొండ నవీన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.


