Nirmal/Kubeer (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 15
కుభీర్ మండలం బెల్గాం తండాలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది, మురికి నీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది, దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మండల పరిధిలోని బెల్గాం తండాలో పారిశుధ్యం లోపించింది. గ్రామంలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త కారణంగా నీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు ఎంత మొత్తుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారని తెలుస్తోంది.
గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల కోసం సర్పంచ్ చొరవతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, కార్మికులు నెలనెలా జీతాలు తీసుకుంటున్నా పనులు మాత్రం అరకొరగానే జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పనులను పర్యవేక్షించాల్సిన కార్యదర్శి కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
అంతేకాకుండా, ప్రతి గ్రామపంచాయతీలో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని, వాటిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకొని వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


