హత్య జరిగిన సమయంపై ప్రత్యక్ష సాక్షులు స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చినప్పుడు, ఆహారం జీర్ణమయ్యే సమయాన్ని ఆధారంగా చేసుకుని వారి సాక్ష్యాలను తిరస్కరించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోస్టుమార్టం సమయంలో కడుపులో ఉన్న ఆహార పదార్థాల ఆధారంగా మరణ సమయాన్ని కచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
అలాగే, మృతుడికి బంధువులైనంత మాత్రాన సాక్షులను పక్షపాతులుగా పరిగణించలేమని పేర్కొంది. విచారణ సమయంలో రూపొందించే మరణ నివేదికలో ప్రత్యక్ష సాక్షుల పేర్లు లేకపోవడం కూడా వారి వాంగ్మూలాన్ని తిరస్కరించడానికి కారణం కాదని తెలిపింది.
కర్ణాటక జంట హత్యల కేసులో తీర్పు
కర్ణాటకలో జరిగిన జంట హత్యల కేసులో షెకప్ప తదితరులు దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. 2008-2009 మధ్య రాత్రి మల్లప్ప, గులప్ప అనే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. గ్రామంలో ఒక ఎద్దు దాడి చేయడంతో మేకకు గాయాలయ్యాయి. దానికి పరిహారం చెల్లించే విషయంలో రెండో నిందితుడికి, గ్రామానికి చెందిన నాగప్పకు మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో మృతులు నాగప్పకు మద్దతుగా నిలిచారనే కోపంతో నిందితులు వారిపై కక్ష పెంచుకున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
హత్య జరిగిన తీరు
2009 తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మల్లప్ప ఇంటి బయట నిద్రిస్తుండగా ఏడుగురు నిందితులు గొడ్డళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం పశువుల కొట్టంలో ఉన్న గులప్పను కూడా హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనకు మృతుల భార్యలు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వారిలో ఒకరికి దాడిలో గాయాలయ్యాయి.
కింది కోర్టుల తీర్పులు, హైకోర్టు నిర్ణయం
ట్రయల్ కోర్టు ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను విశ్వసించింది. దీంతో నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు వైద్యుడి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుంది. మల్లప్ప మరణించిన నాలుగు గంటల తర్వాత గులప్ప మరణించి ఉండవచ్చని వైద్యుడు అభిప్రాయపడ్డారు. దీంతో ఇద్దరి హత్యలు ఒకేసారి జరిగాయన్న ప్రత్యక్ష సాక్షుల వాదనను ట్రయల్ కోర్టు అనుమానించింది. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. ఆహారం జీర్ణమయ్యే సమయం వ్యక్తుల ఆరోగ్యం, తీసుకున్న ఆహారం, జీర్ణశక్తిని బట్టి మారుతుందని పేర్కొంది. కేవలం కడుపులోని ఆహార పదార్థాలను పరిశీలించి మరణ సమయంపై కచ్చితమైన నిర్ణయానికి రాలేమని తెలిపింది.
పోలీసులు తయారుచేసిన మరణ విచారణ నివేదికలో ప్రత్యక్ష సాక్షుల పేర్లు నమోదు చేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 174 ప్రకారం రూపొందించే మరణ విచారణ నివేదిక పరిధి చాలా పరిమితమని వివరించింది. మరణానికి గల కారణాలు, శరీరంపై ఉన్న గాయాలు, వాటి స్వభావాన్ని నమోదు చేయడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఎవరు దాడి చేశారు ఎలా దాడి చేశారు ఆ సమయంలో ఎవరెవరు చూశారు వంటి వివరాలను ఆ నివేదికలో తప్పనిసరిగా పేర్కొనాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.


