బంగా, ఫగ్వారా, లుధియానా, పంజాబ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 22
పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కూలీ మధు, పంజాబ్ లోని ఫగ్వారా సమీపంలో రూ. 3 కోట్ల లాటరీ జాక్ పాట్ గెలుచుకున్నాడు. కేవలం ఒక్క గంట వ్యవధిలోనే అతని జీవితం తలకిందులైంది. కూలీగా పనిచేస్తున్న అతనికి అదృష్టం వరించి కోటీశ్వరుడయ్యాడు.
మనలో చాలా మందికి దరిద్రం ప్రతిసారీ తలుపు తడుతుంది. అదృష్టం మాత్రం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ సమయంలో తలుపు తీయకపోతే లక్ష్మీదేవి వెనక్కి వెళ్లిపోతుంది. రాత్రికి రాత్రే స్టార్ హీరోలు అయినవారు, అలాగే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినవారు కూడా ఉన్నారు. కానీ, కేవలం ఒక్క గంటలోనే కోటీశ్వరుడు అయిన వ్యక్తి గురించి మీరు విన్నారా అది కూడా ఒక వలస కూలీ. ఒక్క గంటలోనే ఏకంగా రూ. 3 కోట్ల జాక్పాట్ కొట్టాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. కొన్ని గంటల వరకూ కూలీ పని కోసం రోడ్ల వెంట నిలబడిన ఆ వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. దీన్ని బట్టి అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వలస కూలీ కోటీశ్వరుడు కావడంపై నెటిజన్లు అతనికి అభినందనలు తెలుపుతున్నారు. మధు అనే వలస కూలీ పశ్చిమ బెంగాల్ కు చెందినవాడు. అయితే, పని కోసం పంజాబ్ లోని జలంధర్ కు వచ్చాడు. అక్కడ ఫగ్వారా సమీపంలోని బంగా, దాని పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ కూలీగా పనులు చేస్తూ, వచ్చే కూలీతోనే తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, మధుకు అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టింది. అతని కుటుంబాన్నే మార్చేసింది. రోజూవారీలాగే కూలీ పనులకు వెళ్లిన మధు, మార్గమధ్యంలో బంగాలోని సహోటా లాటరీ స్టాల్ వద్ద ఆగి, మరో గంటలో లాటరీ ఫలితాలు వెలువడతాయనగా ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. సాధారణంగా ఏమీ ఆలోచించకుండా అలా కొనేశాడు. అయితే, అదే తన జీవితాన్ని మార్చేస్తుందని ముందుగా ఊహించలేకపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో లాటరీ టికెట్ ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో మధు కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలినట్లు తెలిసింది. ఈ విషయాన్ని లాటరీ కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. బంగా చరిత్రలోనే తొలిసారిగా మధు ఏకంగా రూ. 3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మధు, అతని కుటుంబం, బంధువులు ఎగిరి గంతేశారు. సంబరాలు చేసుకున్నారు. కూలీగా ఉన్న మధు ఉన్నట్టుండి ఒక్కసారిగా కోటీశ్వరుడు కాబోతున్నాడంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ లాటరీ టికెట్ క్లెయిమ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.











