గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీవో సల్మాన్ రాజ్ సూచించారు. మండలంలోని అర్లి గొడిశారా గ్రామపంచాయతీలో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు అవగాహన కల్పించారు.
గర్భిణులు, బాలింతలు ప్రతిరోజూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఎంపీవో సల్మాన్ రాజ్ సూచించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సేవలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పోషకాహార లోపం లేకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యం తీసుకురావడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ఎంపీవో సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగం ప్రసన్న వినోద్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మీనా, సీడీపీవో సూపర్వైజర్ రాజశ్రీ, మాజీ ఎంపీటీసీ, ధర్మోరా సెక్టార్ అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


