రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై ఉన్న అపోహలను వీడి, దానిని సద్వినియోగం చేసుకోవాలని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ సూచించారు. పథకాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదని ఆయన హితవు పలికారు.
బైంసా: గాయాలపాలై ఎముకలు విరిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా అప్రూవల్ రావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుందని, ఈ సమయంలో ఇరిగిన ఎముక ప్రాంతం చెడిపోతుందని, నాణ్యమైన ఇంప్లాంట్ వేయరని చెప్పడం శుద్ధ అబద్ధమని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు. ప్రజలు ఈ అపోహలను నమ్మకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, నయా పైసా ఖర్చు చేయకుండా మొత్తం సేవలు ఉచితంగా పొందవచ్చని ఆయన సూచించారు.
ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలు:
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గాయాలపాలైనప్పుడు అన్ని రకాల విరిగిన ఎముకలకు ఉచిత చికిత్స అందిస్తారు. ఇరవై నాలుగు గంటలలోపు అప్రూవల్ లభిస్తుంది. నాణ్యమైన ఇంప్లాంట్ వేస్తారు. రోగి ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా ఇవ్వబడుతుంది. రోగి డిశ్చార్జ్ అయినప్పుడు ఆసుపత్రి నుంచి ఇంటి వరకు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది. ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఉచితంగా మందులు ఇవ్వబడతాయి.
ఈ సౌకర్యాలన్నీ జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని డాక్టర్ జాదవ్ తెలిపారు. ప్రభుత్వం ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడు రూ. పదివేల నుంచి 15 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఈ డబ్బులు ఇంటికి వెళ్లిన తర్వాత పౌష్టికాహారానికి ఉపయోగపడతాయని, అప్పు చేసి తిప్పలు పడడం అనవసరమని ఆయన సూచించారు.












