ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కృషి చేయాలని అన్నారు. డిజిటల్, సామాజిక మాధ్యమాల విస్తరణతో మీడియా రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. బాన్సువాడలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి గతంలోనూ ప్రాధాన్యం ఇచ్చామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం బాన్సువాడలో దాదాపు 60 మంది రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలతో పాటు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబాల సంక్షేమానికి తన వంతు సహకారం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల శిక్షణలో సమాచార హక్కు చట్టం, నేర వార్తల కవరేజీ, వార్తా కథనాల రూపకల్పన, తప్పుడు వార్తలు, సైబర్ నేరాలు, కృత్రిమ మేధ, సామాజిక మాధ్యమాలు, మీడియా నైతిక నియమావళి తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.












