గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీల్లో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు పాల్గొని ప్రశంసా పత్రాలను సాధించారు. వారి ప్రతిభను అధ్యాపక బృందం అభినందించింది.
ఆర్గనైజేషన్ ఆఫ్ గ్లోబల్లీ యునైటెడ్ టీచర్స్ () సాహిత్య విభాగం ఈ పోటీలను నిర్వహించింది. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులను అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి. ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా తమ సృజనాత్మకతను వెలికితీస్తూ రాష్ట్రస్థాయి వేదికలపై ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. సాహిత్య కార్యక్రమాలు విద్యార్థులలో ఆలోచనా పరిధిని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పోటీల్లో పాల్గొని కళాశాల కీర్తిని పెంచాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. లిటరరీ సమన్వయకర్త డా. పి. కిషన్ మాట్లాడుతూ, విద్యార్థులలోని సాహిత్య అభిరుచిని గుర్తించి ప్రోత్సహించడానికి కళాశాల నిరంతరం కృషి చేస్తుందన్నారు. గురజాడ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశంసా పత్రాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు.
తెలుగు అధ్యాపకుడు ఎ. కపిల్ మాట్లాడుతూ, గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి అందించిన నూతన ఒరవడిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చక్కని భావాలతో కవితలు రాసి ప్రతిభ చాటారని పేర్కొన్నారు. మాతృభాషలోని గొప్పతనాన్ని, భావవ్యక్తీకరణను అలవర్చుకుంటూ విద్యార్థులు సాహితీ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. జి. సాయిప్రసాద్, ఎస్. కె. ముజీబ్, జె. యోగలక్ష్మి, ఎస్. పెంటన్న, కె. శ్రీకాంత్ తో పాటు ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులు పాల్గొన్నారు.












