భైంసా, 4 November
ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.2 కోట్ల 7 లక్షల నిధులు మంజూరు చేస్తూ సాంకేతిక అనుమతులు ఇచ్చిందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. నియోజకవర్గంలోని భక్తుల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంజూరైన నిధుల వివరాలను వెల్లడిస్తూ.. మండలం కామోల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ కళ్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.35 లక్షలు, అబ్దుల్లాపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ, మహాలక్ష్మి ఆలయాల నిర్మాణాలకు రూ.50 లక్షలు, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.22 లక్షలు, నర్సాపూర్ మండలం తురాటి గ్రామంలోని శివాలయ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
ఈ ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సాంకేతిక అనుమతులు మంజూరు చేసిందని, ఆలయ కమిటీలు తమ వాటాగా చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను చెల్లించిన అనంతరం ప్రభుత్వం టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని దేవాలయాల నిర్మాణానికి రూ.2.07 కోట్ల నిధులు మంజూరు చేసి సాంకేతిక అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇంచార్జి మంత్రికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో ఆలయాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.