జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మహా ఆడేల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం అనంతరం, కౌట్ల బి గ్రామ భక్తులు, యువకులు తమ సొంత నిధులతో అమ్మవారికి కిరీటం చేయించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే, తమ గ్రామస్తులను కించపరిచేలా వార్తాపత్రికలో వచ్చిన కథనంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మహా ఆడేల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆలయ అభివృద్ధి జరిగినప్పటికీ, అమ్మవారి సన్నిధిలో ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో కౌట్ల బి గ్రామ భక్తులు, యువకులు ముందుకు వచ్చారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా పాడి పంటలు పండించి, అభివృద్ధి చెందిన వారు తమ సంకల్పంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలో, అమ్మవారికి తమ సొంత డబ్బులతో రూ. 4.65 లక్షల విలువైన కిరీటాన్ని చేయించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం తగిన వసతులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. అయితే, ఒక వార్తాపత్రిక అమ్మ పేరున చందాలు.. బడా బాబుల దందాలు అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. అమ్మవారి పుట్టినిల్లుగా భావించే తమ గ్రామస్తులను కించపరిచే విధంగా, అవమానించేలా ఈ వార్త ఉందని కౌట్ల బి గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. తమ సొంత డబ్బులు జమ చేసి ఎండోమెంట్‌కు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదని, తాము మనస్పూర్వకంగా భక్తితో చేసే పనిని విమర్శించడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, తమ గ్రామాన్ని, గ్రామస్తులను కించపరిచేలా వార్తలు ప్రచురించవద్దని వారు కోరారు.


