పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పాలిష్ చేసి, బ్రాండెడ్ పేర్లతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లాలోని మండలంలో ఈ దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోందని సమాచారం.
ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు తక్కువ ధరకు సేకరిస్తున్నారు. అనంతరం ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, నాణ్యత వివరాలు స్పష్టంగా తెలియకుండా బ్రాండెడ్ కంపెనీల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సన్నబియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అక్రమ దందా మరింతగా పెరిగిందని తెలుస్తోంది.
నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రంలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లయ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో, రేషన్ బియ్యం కొనుగోలుదారులు విచ్చలవిడిగా ఈ దందా నిర్వహిస్తున్నారని, అక్రమ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోందని సమాచారం.
ఈ బియ్యాన్ని కిలో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ మార్గాల్లో ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి చేరి, అధిక ధరలకు అమ్ముడవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అధికారుల తనిఖీలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు రైస్ డిపోలపై సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులు ఏకకాలిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలతో వ్యాపారుల్లో కలకలం రేగింది. తూకంలో తేడాలపై కూడా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది.










