నిజామాబాద్ జిల్లా మండలం రామడుగుకు చెందిన సీనియర్ జర్నలిస్టు బస్వరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీకి గురిచేశారని బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. బస్వరాజును పరామర్శించిన ఆయన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన బస్వరాజు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని జగన్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన రాసిన వార్తల నేపథ్యంలో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
మోపాల్ మండలంలో అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. బస్వరాజుపై నమోదైన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, ఘటనపై బాధ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీసుల దాడిలో బస్వరాజు కాళ్లకు గాయాలయ్యాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నదని జగన్ పేర్కొన్నారు. ఆయన వైద్య ఖర్చులతో పాటు కుటుంబ పోషణకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రధాన అనుచరులుగా పేర్కొంటున్న వారి ఆగడాలపై త్వరలో వెయ్యి మందితో ధర్నా చేపడతామని జగన్ తెలిపారు. జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడే అధికారుల వివరాలను నమోదు చేస్తామని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.
త్వరలో నిజామాబాద్ రూరల్‌లో జనతా గ్యారేజ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జర్నలిస్టు బస్వరాజు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మైపాల్ యాదవ్, మాజీ ఎంపీపీ హనుమంత్‌రెడ్డి, రామడుగు సర్పంచ్ రమేష్‌గౌడ్, ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, బాజిరెడ్డి రమాకాంత్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.












