హైదరాబాద్ నగరంలోని మలక్ పేట్ లో పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) అనుమానస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు చనిపోయే ముందు అర్ధరాత్రి సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న యువతి ఆందోళనకు గురై, వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. యువతి ఇచ్చిన సమాచారంతో చైతన్యపురి పోలీసులు అప్రమత్తమై, మలక్‌పేట్ పోలీసులకు విషయం తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, కానిస్టేబుల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు చంద్రశేఖర్ అంబర్పేట్ హెడ్ క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కానిస్టేబుల్ మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


