గీత కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు, సాంఘిక బహిష్కరణలకు పాల్పడుతున్న బీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా మండలంలో జరిగిన మహాసభల్లో ఈ మేరకు తీర్మానించారు. ఈ దాడులకు, అణచివేతకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
నిజామాబాద్ జిల్లా మండలంలోని పల్లె గ్రామపంచాయతీ పరిధిలో రామాలయ ఫంక్షన్ హాల్ లో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించారు. ఈ సభలకు జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి లింగాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అలల్ సాయిబాబాగౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సబ్ డివిజన్లో, దేశంలో మరెక్కడా లేని విధంగా బీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో గీత కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేస్తూ, చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాటలు వినని వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేస్తూ, భౌతిక దాడులకు దిగుతూ, రాజకీయ అండదండలతో అన్ని రంగాలలో బడుగు బలహీన వర్గాల ప్రజలను అణచివేస్తున్నారని, వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని నాయకులు తెలిపారు. ఇటీవల తాళ్లరాంపూర్ లో గౌడ కులస్తులు, దళితులు, వివిధ బడుగు బలహీన వర్గాల కులవృత్తుల వారిపై జరిగిన దాడిని, ఆ సంఘటనపై మీడియా కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులపై, అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు తెలిపారు. భౌతిక దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, బడుగు బలహీన వర్గ సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ, వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని నాయకులు ప్రశ్నించారు. ఒకవైపు బీసీ కమిషన్ వచ్చి విచారణ జరిపి, జరిగిన అన్యాయంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ, నేటి వరకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు అన్నారు. గ్రామ బహిష్కరణలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.
దీనిపై ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి బీడీసీ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలను కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మించి, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ దిశగా అన్ని వర్గాల ప్రజలు బీడీసీ కమిటీల రద్దు కొరకు సాగే పోరాటంలో ముందుకు రావాలని, ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని నాయకులు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో గౌడ కులస్తులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మోకుదెబ్బ పోరాడుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు . కిషన్ గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, వేంపల్లి సరోజగౌడ్, కొండగొని రవీందర్ గౌడ్, పోగుల నగేష్ గౌడ్; జిల్లా నాయకులు చేపూరి జనాగౌడ్, మెరుగు శ్రీనివాస్ గౌడ్, మసగోని రమేష్ గౌడ్, బొజ్జా చిన్నా గౌడ్, రంగుల సిరి గౌడ్, భైరగోని సాయగౌడ్, రంగారి పోషగౌడ్, బూరుగు రాజా గౌడ్; తెలంగాణ గౌడ మహిళా సంఘం నాయకురాళ్లు భైరగోని విజయ, ఉత్కా లక్ష్మి, బొంగోని భాగ్య లత; మండల నాయకులు సత్య గౌడ్, లింబా గౌడ్, తిరుపతి గౌడ్, ఉపేందర్ గౌడ్; జిల్లాలోని వివిధ గ్రామాల గౌడ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.








